Friday, 9 August 2013

బాలాద్వైతం

అద్వైతము అంటే ద్వైతము కానిది. అంటే రెండు కానిది లేక రెండు గా లేనిది. సరే ఇది అందరికి తెలిసిన అర్ధమే అనుకోండీ! ఈ టపా అర్ధం చెప్పడంతో మొదలు పెట్టాలి కాబట్టి అలా మొదలుపెట్టాను. ఇంతకీ బాలాద్వైతం అని ఎందుకు అన్నాను అంటే ... కింద చదవండి.

మిగిలిన టపా చదవబోయేముందు నేను చెప్పేది ఏంటంటే ఈ కింద రాసింది అంతా నా  అనుభవం లోకి వచ్చిన రకరకాల సందర్భాల సమాహారం. ఎక్కడైనా తప్పులు దొర్లితే నేను క్షమార్హుడను. ఇది పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించిన టపా.

సాధారణంగా అద్వైతం అనే పదాన్ని అద్వైత సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు చెప్తారు. అంటే వేదం ప్రతిపాదించిన పరబ్రహ్మము ఒక్కటే. అది కాకుండా వేరేది లేదు అని దాని అర్ధము. మరి బాలాద్వైతం అంటే? ఇది నేను ప్రయోగించిన పదము. ఇంతకుముందు ఎవరైనా వాడారేమో నాకు తెలియదు. అందుకే ధైర్యంగా నేను ప్రయోగించిన పదము అని చెప్పాను. బాల వయసు లో అనగా పుట్టిన శిశువు పెరుగుతున్న కొద్దీ తాను తన చుట్టూ ఉన్న మనుషులను ప్రపంచాన్ని ఎలా చూడడం మొదలుపెట్టి ఎలా చుస్తూ పెరుగుతున్నాడు ఎలా చూస్తూ చనిపోతాడు అనే ఒక చిన్న ఆలోచన లో నుండి పుట్టిందే ఈ టపా. ముఖ్యంగా ఇది మా అమ్మాయి పుట్టి పెరుగుతున్నపుడు నా అనుభవాల లోనుండి ప్రచోదనము చెందింది. సరిగా ఆ సమయము లోనే నేను పెద్దలు ప్రవచించిన రామాయణ భాగవతాలు విన్నాను. బహుశా దాని ప్రభావమే నాలో ఈ ఆలోచనకి కారణం కావచ్చు.

మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థానాపేక్ష తో 
ఛలమూర్ఖత్వముతో సదా భ్రమతతో చాంచల్య చిత్తంబుతో 
బలువైనట్టి కఫజ్వర గ్రహమహా బాల్యామయ శ్రేణితో 
కలనైన తమ చింత లేక చెడితిన్ కామ్యార్ధినై శంకరా !

ఎందుకో ఈ పద్యము తో మొదలుపెట్టాలని అనిపించింది. పెద్ద సంబంధం లేకపోయినా ఈ పద్యం లో శిశువు యొక్క రకరకాల అవస్థలు చెప్పి ఈ అవస్థల వలన కలలోనైనా నీ ధ్యానము చేయలేదు శంకరా అని శతక కర్త అంటారు . గురువు గారు చాలా సార్లు చెప్పిన పద్యమ్. పుట్టిన వెంటనే శిశువు కి ప్రపంచం లో ఉన్నది ఎవరంటే అమ్మే. పుట్టిన క్షణం నుండి కొన్ని నెలలు నిండే వరకు దేవుడి తో సహా అన్ని అమ్మే. బ్రహ్మము లోనుండి వచ్చి బ్రహ్మము లో ఉండి  బ్రహ్మము లోనే కలిసినట్లు, ముందు అమ్మ లో ఉండి తరువాత బయటకి వచ్చి మళ్లీ అమ్మ లోకే వెళ్తాడు. అందుకే శిశువు గా ఉన్నపుడు అమ్మే పరబ్రహ్మము. రెండొవది లేదు. అదే బాలాద్వైతము.

ఇంతకీ తరువాత ఏంటి అంటే నెలలు నిండి వయసు పెరిగే కొద్దీ, నాన్న ని చూస్తాడు. అద్వైతము నుండి ద్వైతము లోకి వచ్చాడు. ఇంక మొదలుతుంది గొడవ అప్పటినుండి. అమ్మ అరిస్తే నాన్న దగ్గరకి రావటం. నాన్న అరిస్తే అమ్మ దగ్గరకి రావటం. దేనికి అంటే ముద్దులాడటానికి. విష్ణువు కోరిక తీర్చలేదని శివుడు దగ్గరకి, శివుడు కోరికలు తీర్చలేదని విష్ణువు దగ్గరకి ఏడ్చుకుంటూ వెళ్ళే వాళ్ళలాగా ! పొద్దునైతే నాన్న కావాలి నాన్నతో ఆడుకోవాలి. రాత్రి అయితే నాన్న వద్దు అమ్మ కావలి ఎందుకంటే నాన్న నిద్రపుచ్చేస్తారు కాబట్టి ! ఇందాక చెప్పిన శివ విష్ణు ఉదాహరణ మళ్లీ అనువర్తిస్తుంది. అయితే ఇదే సందర్భాన్ని ఇంకో రకంగా చూస్తే వాడికి పొద్దున నాన్న కావాలి (పొద్దున అంటే  విష్ణువు ) రాత్రి అమ్మ(రాత్రి అంటే శివుడు) ఇద్దరూ కావాలంటాడు. అమ్మా నాన్నలకి అభేదం చూసినవాడే ఎలా గొడవ చేయనివాడు ఔతాడో శివకేశవుల మధ్య అభేదం చూసినవాడే పరమాత్మ లో కలుస్తాడు !

సరే తరువాత ఏంటి అంటే - ఇంకా వయసు పెరిగే కొద్దీ రకరకాల మనుషులు పరిచయం ప్రారంభం. బంధువులు, స్నేహితులు, వైరులు, ఇంకా ఒకరేమిటి రకరకాల వాళ్ళు రకరకాల విషయాలు చెప్పి అతని మనసు ని ప్రభావింప చేస్తారు. మంచి గురువు చేతిలో పడ్డాడా, వాడి బతుకు ధన్యం. చెడు స్నేహం చేసాడా, బతుకు నాశనం. ఇది ఎలాగంటే పెరిగేకొద్దీ చాలా మంది దేవతల పేర్లు తెల్సుకొని వాళ్ళ కోసం కొట్టుకోని మా వాళ్ళు వేరే జాతి వాళ్ళు వేరే మతం వాళ్ళు అని జీవించి ఉండే కొద్ది సమయం వృధా చేసుకోవడం. అదే గురువు ఉంటే ? అన్ని నదులు సముద్రం లోనికి వెళ్ళినట్లు అన్ని మతాలు కులాలు పరబ్రహ్మము లోనికి వెళ్తాయి అని చెప్తాడు. జీవితం బాగు పడుతుంది.

సరే చాలు చివరికి ఏంటి అంటే? ముసలితనం వచ్చేసరికి చావు కళ్ళ ముందు ఉన్నపుడు శత్రువు మిత్రుడు కొడుకులు కూతుళ్ళు మనమలు మనవరాండ్లు చుట్టూ ఉండే ప్రకృతి, జీవాలు, అందరూ అన్నీ ఒకలా కనిపిస్తారు. ఎలాగా ? తనలాగే తనతోపాటే వచ్చిన మనుషుల్లా, జీవాలుగా !! నిష్టగా జీవించి ఉంటే ఇంకొక అడుగు ముందరికి వేసి ఆ పరబ్రహ్మాన్నే చూసి అందులో కలిసిపోతున్నానని సంతోషంగా భగవంతుణ్ణి  తల్చుకుంటూ తనువు చాలిస్తాడు.

యాదృచ్చికంగా మన చరిత్ర కూడా ఇలానే ఉంది.  ముందర ఋషులు మునులు కేవలం ఆ బ్రహ్మాన్నే ధ్యానించి బ్రహ్మజ్ఞానన్నే పొందారు. తరువాత మెల్లగా శైవులు వైష్ణవులు అంటూ కొట్టుక్కున్నారు. ఆ తరువాత హైందవులు మొహమదీయులు క్రైస్తవులు అంటూ కొట్టుకుంటున్నారు. చివరికి అందరూ ఏమౌతారో చూద్దాం.

ఇదే అద్వైతం లోనుండి ద్వైత ము లోనికి వచ్చి మల్లి అద్వైతం లోకి వెళ్ళటం. మనం రోజూ చేసే పూజ అంతరార్ధం!!

శ్రీ రామ జయ రామ జయ జయ రామ 

1 comment:

Madhuri Vempati said...

chaduvuthunte udhvegaaniki lonayyanu..endukante ninna daadapu ive rakam alochanallo japam chesanu....really nice presentation of your thoughts..really entha goppado kadaa advaita bhavana.i wish u could know more on these aspects.

entha thelusukunte anni janmalu thagguthayi:) futurelo.