Tuesday, 12 June 2012

భాష?రచయిత?

గమనిక : ఈ వ్యాసం ఏ మత ప్రచారం గురించి వ్రాయబడినది కాదు. ఇతర భాషలను తక్కువ చేసి చూపే ప్రయత్నము కాదు. ఇతర రచయితలని తక్కువ చేసి వ్రాసే ఉద్దేశ్యం లేదు.

అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల  నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత  మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

ఈ పద్యం  చదివితే, అంతరార్ధం అర్ధంకాకపోయినా చదవటానికే ఎంతో హాయిగా ఉన్నదన్నది నా అభిప్రాయం. బహుశా నా అభిప్రాయం తో అందరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. అందరికి అమ్మ అయినటువంటి దుర్గా దేవిని భాగవతము వ్రాయబోయే ముందు చేసిన ప్రార్ధన లోని పద్యమిది. నా ఈ వ్యాసమును  ఈ పద్యము తో మొదలుపెట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. ఈ ఉత్పలమాలా పద్యము లో వృత్యానుప్రాసాలంకారం వాడారు మహాకవి పోతన. పదకొండు సార్లు 'అమ్మ' ని పిలిచారు. ఆ అమ్మ  పలికినందుకే అంత మంచి ఆణిముత్యం లాంటి భాగవతం మనకు తెలుగు లో లభించింది అని నేను నమ్ముతాను.
చిన్నతనంలో, తెలుగు చదువుకునే రోజుల్లో, "ఇది మనకి తెలియని భాష?" అనే ఒక పొగరు, ధైర్యం ఉండేవి కాని ఈ భాష లోని మాధుర్యం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. చిన్నతనంలోనే  ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. "పద్యాలా ? అంత  కష్టమైనవి నాకు ఎక్కవులే.." అని. ఈ పద్యాలు  ఇప్పుడు చదువుతుంటే అసలు అలా అనిపించటంలేదు. ఒక కవి కానీ పండితుడు కాని ఒక కావ్యం లేక కవిత్వం రచించాలంటే కలము కాలము కాగితం ఉంటే సరిపోదు. దానితో పాటు పదాలు కావాలి. ఆ పదాలని ఒక పద్ధతి ప్రకారం సమకూర్చటానికి నియమాలు కావాలి. ఆ నియమాలు రచనని కష్టతరం చేయకుండా ఉండాలి. అలాగే ఆ రచనలో వాడే పద జాలం అర్ధం చేసుకోటానికి సులభంగా ఉండేలా రచించవచ్చు లేక మొదటిసారి చదివినపుడు కేవలము అర్ధము రెండొవ సారి చదివినపుడు ఆ రచన లోని అంతరార్ధము తెలిసేలా రచించవచ్చు . ఆ రచనా నియమాలని, అర్ధాన్ని అందించగలిగిన పద సంపత్తి ని భాష అందించగలగాలి. ఇన్ని ఉన్నా ఆ రచన చేసే వారికీ దేనిని ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలిసి ఉండాలి. ఇన్ని ఒకసారి జరిగితేనే ఒక అందమైన అద్భుతం ఉద్భవిస్తుంది. అందరికి రుచిస్తుంది. రచనా శక్తి రచయితది అయితే ఆ రచన కి కావాల్సిన భాషా సంపత్తిని ఇవ్వగలిగిన సత్తా తెలుగు భాష కి  కచ్చితంగా ఉందని చెప్పగలను. లేకపోతే అసలు ఆంధ్రమహా భాగవతము మనకి వచ్చేది కాదు, మహాభారతము తెలుగు లో ఉండేది కాదు, అన్నమయ్య కీర్తనలను ఆనందించే అవకాశం ఉండేది కాదు.

ఒకసారి ఈ తేటగీతి పద్యాన్ని చూద్దాం. ఇది కూడా పోతన్న గారు వ్రాసిన ప్రార్ధన లోనిదే.

చేతులారంగ శివుని బూజింపడేని, నూరునోవ్వంగా హరికీర్తినుడువడేని,
దయయు సత్యంబులో ను గా దలుపడేని, కలుగ నేటికి తల్లుల కడుపుచేటు

అసలు ఈ పద్యం లో అర్ధంకాకపోవటానికి ఏముంది? ఎంత శ్రావ్యమయిన చిన్న చిన్న పదాలు వాడి అందించవలసిన భావాన్ని పూర్తిగా అందించారు. ఇలాంటి పద్యాలు చదువుతుంటే ఒక రకమైన అనుభూతి కి లోనౌతాం. ఆ అనుభూతి ని వర్ణించాలంటే నాకైతే మాటలు రావు. తెలుగు లోనే రావు. మరి అలంటి అనుభూతిని కూడా పైన చెప్పిన షరతులని కలుపుకుంటూ ఒక పద్యాన్నో ఒక పాటనో ఒక కీర్తననో రాయాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలి. ఎంత అవగాహనా ఉండాలి. అందుకే పోతన గారు భాగవతం మొదట్లో నే ఈ కంద  పద్యం చెప్తారు. ఇది నా గొప్పతనం కాదు, రాముడు రాయిస్తే నేను రాసాను అని. దీనికి కూడా నేను ప్రత్యేకించి అర్ధం చెప్పక్కర్లేదు.

పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభాద్రుందట నే
పలికిన భవహరమగునట, పలికెద వేరోక్కగాధ పలుకగనేల

ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని పద్యాలో రాయచ్చు. అలాగే ఇంకా కీర్తనల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన (మొట్టమొదటి) తెలుగు వాగ్గేయకారుడు  శ్రీ అన్నమాచార్యుల వారు. నేను విన్నటువంటి కొద్దిపాటి అన్నమాచర్య కీర్తనలలో నాకు అర్ధమైనది ఒకటుంది. అదేమిటంటే అనుభూతి ని పాటగా ఎలా మరల్చవచ్చు అనే ప్రశ్న కి సమాధానం. దేవుడిని అందరు పూజిస్తారు కొలుస్తారు. కాని దైవత్వాన్ని అనుభవించి ఆ అనుభవాన్ని కీర్తనల రూపం లో అందించారు. ఆయన వ్రాసిన వేల కొద్ది కీర్తనలని సుప్రభాత  కీర్తనలని, శృంగార కీర్తనలని, వర్ణనా కీర్తనలని, వైరాగ్య కీర్తనలుగా ఇలా రకరకాలుగా విభజించవచ్చు. ఉదాహరణ కి "విన్నపాలు వినవలె వింతవింతలు.." అనే కీర్తన లోని చరణం లో ఈ రెండు వాక్యాలు చుడండి. ఎంత చిన్న చిన్న పదాలతో ఎంత అర్ధాన్ని, ఎంత వర్ణనని పొందుపర్చారో!! నాకు తెల్సినంతవరకు ఇది ఒక సుప్రభాత కీర్తన.

చల్లని తమ్మి రేకుల ... సారసపు కన్నులూ
మెల్ల మెల్లనే విచ్చి ... మేలుకోనవేలయ్య ...

ఇంకొక ఉదాహరణ. ఇది కూడా వర్ణనే. ఇందులో శ్రీ వేంకటేశ్వరుడిని మరియు అలిమేలుమంగా దేవిని కలిపి వర్ణించారు. ఈ వాక్యాలు "ఒకపరికొకపరి వయ్యారమై ..." అనే కీర్తన లోనివి.

మెరుపు తోటి ...అలమేలుమంగాయుతాను ..
మెరుపూ మేఘము కూడి మెరసినట్లుండె .....

ఈ వాక్యాలలో ఉపమాలంకారం తో పాటు వృత్యానుప్రాసాలంకారం కలిపి ఉన్నది. ఇంకా ఇలాంటి కీర్తనలని ఆలపించినపుడు కానీ వింటున్నపుడు కానీ కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది. మనకి లభిస్తున్న 12000 కీర్తనలు గురించి సమీక్షించాలంటే?అంత అవసరం లేదు. రుచి చెప్పటానికి పండు అంతా తిననక్కర్లేదు కదా !! నేను విన్న కొన్ని అన్నమయ్య కీర్తనలలో నాకు బాగా నచ్చినది "ముద్దుగారే యశోద.." శ్రీ వేంకటేశ్వరుడి నవరత్నాలను కృష్ణుడి కధకి జోడించి చేసిన కీర్తన అది.

.........
.........
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము కాచే కమలాక్షుడు ....

కాళింగుడి తలల ఫై కప్పిన పుష్యరాగము 
ఏలేటి శ్రీ వేంకటాద్రి  ఇంద్రనీలము 
పాల జలనిధి లోన పాయని దివ్య రత్నము 
బాలుని వలె తిరిగీ ..పద్మనాభుడూ..
.......
.......

ఇంతకి ఇదంతా వ్రాసాను కానీ, రచయిత గొప్ప భాష గొప్ప అనే ప్రశ్న మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. భాష బావుంటే రచన బావుంటుంది అనేది నిజమే. భాష కావాల్సినవన్నీ ఇస్తున్నా రచయిత సరిగా వాడు కోక పోతే అది మంచి రచన కాజాలదు అన్న వాదన లో కూడా తప్పు లేదు అని అనిపిస్తుంది. ఏది ఏమైనా నాకు అర్ధమైంది ఏమిటంటే, ఒక రచయిత తను చెప్పదలచుకుంది ముందు తాను అనుభూతి చెందితే ఆ రచన కి కావాల్సిన పదాలు  తెలియకుండా అలవోకగా ఆ రచన లోకి వచేస్తాయి. తప్పంటారా? ఇన్ని విని చదివినతరువాత నాకు ఎందుకు ఇలా   అనిపించిందంటే దాని కారణం ఈ కింద శ్రీ రామదాసు కీర్తన.

శ్రీ రామ నీ నామమెంతో రుచిరా .. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా...

'రుచి' అనేది ఒక అనుభవం. కాని అది తిండి విషయంలోనే వాడతాము. ఒక అనుభూతి ని తెలియపరచడానికి 'రుచి' అనే పదం వాడొచ్చని నాకు అప్పుడే అర్ధమైంది. రామదాసు రామ నామములోని, రామాయణం లోని అర్ధాన్ని  దైవత్వాన్ని పూర్తిగా అనుభవించారు కాబట్టే అంత అనుభవాన్ని రుచి అనే రెండు అక్షరముల చిన్న పదం లో ఆవిష్కరించారు. పోతన్న పద్యాలు కానీ అన్నమయ్య కీర్తనలు కానీ వారు ఆ అనుభూతి కి లోనయ్యారు కనకనే వారి సాహిత్యం ఎంత కాలమైన అల నిలిచిపాయింది. ఇప్పటికి వారి అనుభూతి లోని  కొంత భాగమైన మనం అనుభవించగల్గుతున్నాం అన్నది నా అభిప్రాయం. ఇది తెలుగు వాడిగా నేను, ఈ వ్యాసం చదివే ప్రతి ఒక్కరు చేసుకున్న అదృష్టం!! ఎంత అందమైన భాష అంటే, పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వస్తుంటే వాళ్ళు అమ్మ, నాన్న, తాత, మామ్మఅని రెండు అక్షరాల పదాలు అనటం మొదలు పెడతారు. ఎంత ముద్దుగా అంటారో చెప్పాల్సిన పని లేదు. తెలుగు భాష ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, అవే పదాలని వాళ్ళు ఇంట్లో రక్త సంబంధాలని పిలవటానికి వాడాలి అని పెట్టారు. దాని వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య వ్యక్తిగత సంబంధాలని చివరి దాక నిలుపుతుంది.

2 comments:

Unknown said...

Felt good after reading the passage... keep posting.

Hareesh said...

Thanks Raghu garu...